Thursday, 6 October 2016

మద్యంపై ఉన్న విజన్ మంచినీటిపై లేదా?

మద్యంపై ఉన్న విజన్ మంచినీటిపై లేదా?


మద్యం విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు అనుసరిస్తున్న విధానాలపై విపక్ష వైసీపీ మండిపడుతోంది. ముఖ్యమంత్రికి మద్యంపై ఉన్న విజన్ మంచినీటిపై లేదని ఆ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఈరోజు విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో మద్యం షాపులను పుట్టగొడుగుల్లా ఏర్పాటు చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యాన్ని నియంత్రించి ప్రజల బతుకులను బాగు చేయాల్సింది పోయి మద్యం షాపులను పెంచుతాం - మద్యాన్ని ఏరులా పారిస్తాం అనే రీతిలో ముఖ్యమంత్రి ప్రకటనలు చేస్తున్నారంటూ ఆమె ధ్వజమెత్తారు.

ఏపీలో ఇప్పటికే మద్యం దుకాణాలు పెద్ద ఎత్తున ఉన్నాయి. వినియోగం కూడా అధికంగా ఉంది. ఇలాంటి తరుణంలో ఇప్పుడు ఉన్నదానికన్నా ఎక్కువ మద్యాన్ని ఉత్పత్తి చేయాలనుకోవడం దారుణమైన నిర్ణయమని ఆమె ఆరోపించారు.  చంద్రబాబు పాలనలో నవ్యాంధ్రప్రదేశ్ మద్యాంధ్రప్రదేశ్ గా మారుతోందంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఖజానా నింపుకోవడమే చంద్రబాబు లక్ష్యంగా కనిపిస్తుందని.. ఆ ప్రయత్నంలో పేదల ఆరోగ్యం - జీవితాలతో ఆడుకుంటున్నారని అన్నారు. 

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని చెప్పుకుంటున్న చంద్రబాబు  డబ్బు కోసం మద్యాన్ని ఏరులై పారించడం ఎంతవరకు సబబని పద్మ ప్రశ్నించారు. అవినీతిలో దేశంలోనే ఏపీ నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోందని పద్మ ఎద్దేవా చేశారు. మద్యం వ్యాపారుల నుంచి టీడీపీ నేతలు ప్రతి నెలా ముడుపులు తీసుకుంటున్నారని ఆమె ఆరోపించారు. ఆ విషయం చంద్రబాబుకు కూడా తెలుసని అన్నారు. మద్యం విక్రయాల విషయంలో ఆబ్కారీ శాఖకు భారీ టార్గెట్లు ఇవ్వడం.. ఉత్పత్తి పెంచుకునే దిశగా పావులు కదుపుతున్న నేపథ్యంలో ఆమె ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. 

Friday, 30 September 2016

ఆ సీఎం మహా షార్ట్ టెంపర్ అట


ఆ సీఎం మహా షార్ట్ టెంపర్ అట


టెంపర్..  షార్ట్ టెంపర్.. తిక్క.. హైపర్ లాంటి పేర్లతో సినిమాలు వచ్చేయటం.. అందులోని కథానాయుడ్ని ఇలాంటి పేర్లతో పిలవటమో.. లేదంటే అతడిలో ఉండే  ఆ గుణాన్ని చూపించటమో చేస్తారు. రీల్ లైఫ్ లో వినిపించే ఈ పేర్లను తాజాగా ఒక ముఖ్యమంత్రికి లింక్ చేసి.. ఒక మహిళా ఎంపీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శరద్ పవార్ కుమార్తె కమ్ ఎంపీ సుప్రియా సూలే ఫడ్నవీస్ మీద ఘాటు విమర్శలు చేశారు.

ఫడ్నవీస్ కు షార్ట్ టెంపర్ ఎక్కువని.. ఆయన దగ్గరకు వెళ్లాల్సి వస్తే తాను హెల్మెట్ పెట్టుకొని వెళతానంటూ ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎందుకిలా అన్న ప్రశ్న వేయకుండానే ఆమే.. ఆ విషయాన్ని చెప్పుకొస్తూ.. ఫడ్నవీస్ కు షార్ట్ టెంపర్ చాలా ఎక్కవని.. ఊరికే ఆగ్రహం చెందుతారని.. అలాంటి సమయంలో ఆయన చేతిలో ఏం ఉంటే దాన్ని విసురుతారంటూ సంచలన ఆరోపణలు చేశారు.

తాను చాలామంది ముఖ్యమంత్రుల్ని చూశానని.. కానీ.. ఇలాంటి షార్ట్ టెంపర్ ఉన్న ముఖ్యమంత్రిని మాత్రం తాను చూడలేదని ఆమె వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి వద్దకు తాను వెళ్లాల్సి వస్తే.. హెల్మెట్ పెట్టుకొని వెళతానని.. ఏదైనా విషయం మీద ఆగ్రహం వస్తే ఆయన ఏ వస్తువునైనా విసిరే ప్రమాదం ఉందన్నారు. నీళ్ల కుళాయిల వద్ద మహిళలు దెబ్బలాడుకునే తీరులో ఫడ్నవీస్ గొడవపడతారని ఆమె మండిపడ్డారు. ఒక ముఖ్యమంత్రి మీద ఒక మహిళా ఎంపీ ఈ తీరులో ఫైర్ కావటం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

పాక్ పై పోరాటంలో పశ్చిమ గోదావరి పల్లె

పాక్ పై పోరాటంలో పశ్చిమ గోదావరి పల్లె
దేశం కోసం ప్రాణాలు అర్పించడం అనేది ఒక వీర జవాను మాత్రమే అనుభూతి చెందగల ఒక గొప్ప అనుభూతి. శత్రుమూకలు ముంచుకొస్తున్నా... మీసాన్ని మెలేసి దేశం కోసం పోరాడటంలో ఉన్న కిక్ వేరు. మేరా భారత్ మహాన్ అంటూ రొమ్ము విరుచుకుని సరిహద్దులో నిలబడగల జవాను జీవితం ధన్యం. అలాంటి వీర జవాన్లకు ఆ ఊరు పుట్టినిల్లు. ప్రతీ ఇంటి నుంచీ ఒకరిని సైన్యంలోకి పంపిన నేల అది. సరిహద్దుల్లో సైనికులు అప్రమత్తంగా ఉన్న ప్రస్తుత తరుణంలో ఆ ఊరిలోని ప్రతీ ఇల్లూ దేశభక్తి ఉరకలువేస్తోంది. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడుందంటే... పశ్చిమ గోదావరి జిల్లాలోని మాధవరం.

ఈ ఊరిలో ప్రతీ ఇంట్లో ఒక సైనికుడు పుడతాడు. ఏదో ఒక హోదాలో భరతమాతకు సేవ చేసినవాడై ఉంటాడు. తమ బిడ్డల్ని ఎంతో గర్వంగా సైన్యంలోకి పంపడం ఆ గ్రామస్థులకు ఆనందం. నిడదవోలుకు సమీపంలో ఉన్న ఈ గ్రామం నుంచి ప్రస్తుతం 109 మంది సైన్యంలో ఉన్నారు. వీరిలో 65 మంది జవాన్లు. మిగతావాళ్లు వివిధ సైనిక విభాగాల్లో విధులు నిర్వహిస్తున్నారు. అయితే ప్రతీ ఇంటి నుంచీ ఒక సైనికుడిని తయారు చేసే స్ఫూర్తి ఈ గ్రామస్థులకు ఎక్కడి నుంచి వచ్చిందంటే... అది వాళ్ల బ్లడ్ లోనే ఉంది. అవును సైన్యంలో సేవలు అందించడం అనేది మాధవరం ప్రజలకు తరతరాలుగా వస్తున్న వారసత్వ సంపద.

దాదాపు 300 సంవత్సరాలుగా మాధవరం ప్రజలు సైన్యంలో సేవలందించడం ప్రారంభించారు. అప్పట్లో వివిధ సంస్థానాల్లోనూ రాజ్యాల్లోనూ సైనికులుగా పనిచేసేవారు. పూసపాటి మాధవవర్మ పాలనా కాలం నుంచి వీరు సైన్యంలో చేరడం మొదలైంది. సైన్యంలో చేరడం ఆనాటి నుంచే ఓ సంప్రదాయంగా మారిపోయింది. పల్నాడు బొబ్బిలి వంటి రాజ్యాల్లో మాధవరం సైనికులు పనిచేశారు. బ్రిటిష్ సైన్యంలో కూడా మాధవరం వారు సేవలు అందించారు. మొదటి ప్రపంచయుద్ధంలో 90 మంది సైనికులు ఈ గ్రామం నుంచి పాల్గొన్నారు. ఇక ఈ గ్రామంలో ఎక్స్ సర్సీస్ మెన్ విషయానికొస్తే... దాదాపు 1200 మంది వరకూ ఉన్నారు. ఈ ఊళ్లోవారు పేర్లు పెట్టి పిలుచుకోరు! సైన్యంలో పొందిన హోదాలతోనే వీళ్లంతా ఒకరిని ఒకరు పిలుచుకుంటూ ఉంటారు. అంతేకాదు పిల్లలకు కూడా సుబేదార్ కమాండర్ కెప్టెన్ మేజర్ లాంటి పేర్లు పెడుతూ ఉంటారు.

సైన్యంలో ఉత్తమ సేవలు అందించి అవార్డులు అందుకున్నవారు కూడా ఈ గ్రామంలో ఉన్నారు. మాధవరం గ్రామానికి చెందిన సుబేదార్ వెంకటాచలం రావుబహద్దూర్ బిరుదు పొందారు. విక్టోరియా క్రాస్ పతకం కూడా అందుకున్నారు. ఈయన తనయుడు చైనా - బంగ్లాదేశ్ యుద్ధాల్లో పాల్గొన్నారు. ఈయన మనవడు మానస్ ప్రస్తుతం సైన్యంలో సేవలందిస్తున్నారు. ఈ విధంగా సైనిక పరంపర కొనసాగుతోంది. భారత దేశానికి సైనికులను అందించడంలో మాధవరం కృషిని ప్రభుత్వం గుర్తించిందని చెబుతున్నారు. త్వరలో ఈ గ్రామంలో సైనిక శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టుగా మాధవరం ప్రజలు అంటున్నారు. భరతమాత నుదిటిపై వీర తిలకం దిద్దుతున్న సైనికులకు పుట్టినిల్లైన మాధవరానికి జయహో.

పాక్ ఎటాక్ లో ఆసక్తికర కోణాలెన్నో..

పాక్ ఎటాక్ లో ఆసక్తికర కోణాలెన్నో..



సహనాన్ని చేతకానితనంగా భావించే దాయాది పాకిస్థాన్ కు కరెంటు షాక్ తరహాలో జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ తో దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిన పరిస్థితి. భారత ప్రధాని మోడీ నోటి వెంట వచ్చిన మేనేజ్ మెంట్ గురు మాటల్ని అందరి మాదిరే ఆలోచించి పడాల్సిన గోతిలో పడటమే కాదు.. భారత్ తో పెట్టుకుంటే ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందన్న విషయం తాజాగా అర్థమైందని చెప్పాలి. ఉరీ ఉగ్ర ఘటనకు బదులు తీర్చుకుంటామని ప్రధాని మోడీ చెప్పిన మాట ఎంత అక్షర సత్యమన్నది కూడా తాజా ఎపిసోడ్ తో స్పష్టమైంది. ఇదిలా ఉంటే.. పాక్ కు షాకిచ్చేలా జరిగిన ఎటాక్ లో ఆసక్తికర కోణాలు చాలానే ఉన్నాయి. వాటి వివరాల్లకి వెళితే..

= తాజా దాడికి ఇస్రో కీలకంగా మారిందన్న మాట వినిపిస్తోంది. ఎందుకంటే.. ఈ ఏడాది జూన్ లో ఇస్రో ప్రయోగించిన కార్టోశాట్ 2సీ ఉపగ్రహాన్ని ‘ఆకాశ కన్ను’గా అభివర్ణిస్తారు. భారత సైనికులు టార్గెట్ గా ఫిక్స్ చేసిన ప్రాంతాలకు సంబంధించిన ఫోటోలు.. అక్కడి పరిస్థితులపై అవగాహనకు కార్టో శాట్ సాంకేతిక సాయం చేసిందన్న మాట వినిపిస్తోంది. ఫోటోలతో పాటు.. వీడియోలు కూడా చిత్రీకరించే సత్తా ఉన్న ఈ ఉపగ్రహ సేవలతోనే ఈ ఆపరేషన్ ను విజయవంతంగా ముగింసిందన్న మాట వినిపిస్తోంది.

=  భారత సైనికులు చేపట్టిన అటాక్ లో పాక్ గడ్డపై చనిపోయిన ఉగ్రవాదులు ఎంతమంది అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. భారత ప్రభుత్వం అధికారికంగా ప్రకటించకపోవటం.. పాక్ అసలు తమ దేశంలో లక్షిత దాడి జరగనే లేదంటూ బుకాయించటంతో.. ఈ ఎపిసోడ్ లో మరణించిన ఉగ్రవాదుల లెక్క ఒక పట్టాన తేలటం లేదు. ఒక అంచనా ప్రకారం 14 మంది ఉగ్రవాదులు మరణించినట్లు చెబుతున్నా.. ఆ సంఖ్య ఎక్కువగా ఉందన్న మాట వినిపిస్తోంది. మరికొన్ని మీడియా సంస్థల లెక్క ప్రకారం 40 మంది వరకూ ఉగ్రవాదులు చనిపోయి ఉంటారని తెలుస్తోంది. వారికి సాయంగా నిలిచిన పాక్ సైనికులు ఎనిమిది మంది మరణించినట్లుగా చెబుతున్నారు. అంకెలు సరిగా లేకున్నా.. ప్రాణాలు కోల్పోయిన ఉగ్రవాదుల సంఖ్య మాత్రం ఎక్కువగానే ఉందని చెబుతున్నారు.

= సర్జికల్ స్ట్రైక్స్ కు భారత్ ఎందుకు వెళ్లింది? దాని వెనుక ఏదైనా బలమైన కారణం ఉందా? అంటే.. అవుననే చెబుతున్నారు. భారత్ ఎప్పుడూ బాధ్యతగానే వ్యవహరిస్తుంది. తొందరపడదన్న ఇమేజ్ కు తగ్గట్లే తాజా దాడుల వెనుక భారీ కుట్రను చేధించేందుకే ఈ దాడులు చేసిందన్న మాట వినిపిస్తోంది. భారత్ లోని తొమ్మిది ప్రధాన నగరాల్లో భారీ విధ్వంసానికి పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రమూకలు కుట్ర పన్నటం.. దీనికి సంబంధించిన విశ్వసనీయ సమాచారం భారత్ కు చేరటంతో తాజా దాడికి మోడీ సర్కారు ప్లాన్ చేసిందని చెబుతున్నారు. పెద్ద ఎత్తున ఉగ్రవాదుల్ని దేశంలోకి వదిలి.. భారీ విధ్వంసం సృష్టించాలన్నది ఉగ్రవాదుల లక్ష్యంగా చెబుతున్నారు. అందుకే తాజా దాడి చేసినట్లుగా చెబుతున్నారు. ఈ దాడి సందర్భంగా ఉగ్రవాద స్థావరాల్లో తొమ్మిది ప్రధాన నగరాలకు సంబంధించిన మ్యాప్ లు ఉన్నాయని చెబుతున్నారు.

= పాక్ తో యుద్ధం వస్తే? అన్న ప్రశ్నకు సమాధానం చాలామంది చాలా రకాలుగా చెబుతుంటారు. మన సంగతిని పక్కన పెట్టి.. ప్రతి విషయాన్ని సాంకేతికంగా లెక్కలేసి మరీ తేల్చే అమెరికా గూఢచార సంస్థ ఏమనుకుంటుందోనన్న విషయాన్ని చూస్తే.. ఆసక్తికర అంశాలు బయటకు వస్తాయి. భారత్.. పాక్ కు ఉన్న ఆయుధ సంపద.. సైనిక బలగాలు.. వాటి నేర్పు.. ఇలా లెక్కలన్నింటిని శాస్త్రీయంగా లెక్క కట్టిన అమెరికా గూఢచార సంస్థ పాక్ తో పోలిస్తే భారత్ దే పైచేయి అని తేల్చేసింది. సైనికుల సంఖ్య మొదలు ఆయుధాల వరకు భారత్ వద్దే భారీగా ఉన్నాయని.. యుద్ధం కానీ వస్తే.. దాయాదిని దెబ్బ తీసేంత ఆయుధాలు భారత్ వద్ద పుష్కలంగా ఉన్నట్లు అమెరికా తేల్చేసింది. ఒకట్రెండు అంశాలు మినహాయిస్తే.. మిగిలిన అన్ని అంశాల్లోనూ పాక్ కంటే భారతదేశమే మెరుగ్గా ఉన్నట్లుగా అమెరికా తేల్చటం గమనార్హం.

ఏపీ టీడీపీ ఎమ్మెల్యే ఇంట్లో రూ.300 కోట్లు?

ఏపీ టీడీపీ ఎమ్మెల్యే ఇంట్లో రూ.300 కోట్లు?



ఒక ఎమ్మెల్యే ఇంట్లో రూ.300 కోట్లు. నమ్మలేకున్నా... ఇది నిజం. వందలాది కోట్లు పోగేసుకున్న వైనం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ప్రముఖ మీడియా సంస్థల్లో పెద్దగా ఫోకస్ కాని ఈ విషయానికి సంబంధించి వివరాలు ఆసక్తిని రేకెత్తిస్తోంది. అవినీతి మీద యుద్ధం చేస్తానని బడాయి కబుర్లు చెప్పిన బాబు పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఇంట్లోనే  ఇంత భారీ మొత్తంలో ఆక్రమ సంపాదన బయటకు రావటం హాట్ టాపిక్ గామారింది. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు? బ్లాక్ మనీకి సంబంధించిన ఈ పాపం ఎలా బయటకు వచ్చిందన్న విషయాల్లోకి వెళితే..

టీడీపీ నేత.. చిత్తూరు ఎమ్మెల్యే డీకే సత్యప్రభ (దివంగత ఆదికేశవుల నాయుడు సతీమణి) కు సంబంధించిన సంస్థలపై ఐటీ అధికారులు దాడి చేశారు. చిత్తూరు.. బెంగళూరుతో సహా దేశంలోని పలు ప్రాంతాల్లో ఆమెకున్న విద్యా.. ఇతర సంస్థలపై ఐటీ అధికారులు ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమెకు చెందిన రూ.300 కోట్ల మేర పన్ను చెల్లించని ఆస్తుల్ని గుర్తించినట్లుగా చెబుతున్నారు. ఈ వ్యవహారం ఏపీ రాజకీయవర్గాల్లో సంచలనంగా మారింది. ఇటీవల కాలంలో ఏపీ అధికారపక్షానికి చెందిన నేతలకు సంబంధించిన యవ్వారలు ఒక్కొక్కటిగా బయటపడుతున్న వేళ.. తాజాగా వందల కోట్ల రూపాయిలు ఒక్క ఎమ్మెల్యే దగ్గర బయట పడటం షాకింగ్ గా మారింది.

బెంగళూరుకు చెందిన ఐటీ అధికారులు ఈ దాడులకు పాల్పడ్డారు. బెంగళూరుకు చెందిన వైదేహి.. మాల్యా ఆసుపత్రుల్లో దాడులు చేశారు. దాదాపు రూ.265 కోట్ల ఆస్తులకు సంబంధించిన సరైన ఆధారాలు చూపించకపోవటంతో వాటిని సీజ్ చేసిన అధికారులు.. ఎమ్మెల్యేకు చెందిన విద్యా సంస్థల్లో దాదాపు రూ.43 కోట్ల మేర నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. స్వచ్ఛంద కార్యక్రమాల కోసం ఎమ్మెల్యేకు సంబంధించిన కొన్నిఎన్జీవోలు పెద్ద మొత్తంలో విరాళాలు సేకరించటం.. ఆమెకు సంబంధం లేని సంస్థల నుంచి సైతం పలు పత్రాల్ని స్వాధీనం చేసుకోవటం గమనార్హం.

ఓపక్క నల్లధనాన్ని తెలుపు చేసుకునేందుకు కేంద్రం ప్రత్యేక పథకాన్ని ప్రవేశ పెట్టి పెద్ద ఎత్తున ప్రచారం చేయటం.. ఈ రోజు (శుక్రవారం) అర్థరాత్రి పన్నెండు గంటల వరకూ అవకాశం ఉన్నప్పటికీ.. నల్లధన స్వాముల్లో పెద్దగా చలనం లేదన్న ఉదంతాన్ని చూస్తే అనిపించకమానదు. అవినీతి మీద యుద్ధం చేస్తానని చెప్పే చంద్రబాబు.. ఈ ఉదంతంపై ఏం సమాధానం చెబుతారో..?

పాక్ కు లేటెస్ట్ షాకిచ్చిన శ్రీలంక!

పాక్ కు లేటెస్ట్ షాకిచ్చిన శ్రీలంక!




పాక్ కు బ్యాడ్ టైం మొదలైనట్లే. నిలువెల్లా విషాన్ని పెట్టుకొని.. ప్రపంచానికి ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తున్న ఆ దేశం తీరుపై చుట్టుపక్కల దేశాలు ఎంత గుర్రుగా ఉన్నాయన్న విషయం తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఉరీ ఉగ్రఘటన నేపథ్యంలో సీరియస్ అయిన ప్రధాని మోడీ నోటి నుంచి ఒక కీలక మాట వచ్చింది. పాక్ ను ప్రపంచంలో ఏకాకిని చేస్తామని ఆయన ఆగ్రహంగా వ్యాఖ్యానించారు. మోడీ నోటి నుంచి వచ్చిన మాటను పాక్ తో సహా పలువురు లైట్ తీసుకున్నారు. కానీ.. ఇలాంటి వ్యాఖ్యల్ని ఎంతో ముందుచూపుతో మోడీ చేసిన విషయం ఇప్పుడిప్పుడే అందరికి అర్థమయ్యే పరిస్థితి.

ఉరీలో సైనికుల ప్రాణాలు తీసినందుకు భారీమూల్యం చెల్లించుకోక తప్పదని.. భారత్ ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టదని.. దెబ్బకు దెబ్బ తప్పదంటూ తీవ్రస్వరంతో మోడీ చేసిన వార్నింగ్ ప్రభావం ఎంతలా ఉంటుందన్నది పాక్ తో పాటు ప్రపంచానికి తెలిసే పరిస్థితి.  నవంబరు 9.. 10 తేదీల్లో ఇస్లామాబాద్ లో జరగాల్సిన సార్క్ దేశాల సదస్సుకు భారత్ హాజరు కానని తేల్చి చెప్పిన వేళ.. భారత్ బాటలోనే పలు దేశాలు నడుస్తూ.. తాము కూడా రాలేమని చెప్పటం తెలిసిందే.

ఎనిమిది సభ్య దేశాలున్న సార్క్ కూటమిలో.. ఉరీ ఉగ్రఘటన నేపథ్యంలో ఇస్లామాబాద్ లో జరిగే సదస్సుకు హాజరయ్యేది లేదని భారత్ తేల్చి చెప్పగా.. భారత్ తో పాటు ఆఫ్ఘనిస్తాన్.. బంగ్లాదేశ్.. ఆ తర్వాత భూటాన్ సైతం సదస్సుకు రాలేమని తేల్చి చెప్పాయి. ఇంతకాలం మౌనంగా ఉన్న శ్రీలంక సైతం తాము సైతం సదస్సుకు హాజరు కాలేమని చెప్పేసింది. కాస్త ఆలస్యంగా రియాక్ట్ అయినప్పటికీ.. లంక నో చెప్పిన టైం పాక్ స్థైర్యాన్ని తీవ్రంగా దెబ్బ తీసేదిగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు.. సార్క్ దేశాలకు నేతృత్వం వహిస్తున్న నేపాల్ సదస్సును రద్దు చేసే దిశగా ఆలోచిస్తోంది.

ఇక.. మాల్దీవుల నుంచి కూడా భారత్ కు సానుకూల సందేశమే వస్తుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. యూరీ ఘటన నేపథ్యంలో భారత్ కు అండగా పలు దేశాలు నిలుస్తుంటే.. పాక్ కు రోజు రోజుకు ఒంటరి అయిపోతున్న పరిస్థితి. శ్రీలంక ఇచ్చిన తాజా షాక్ .. ఆ దేశ స్థైర్యాన్ని తీవ్రంగా దెబ్బ తీస్తుందనటంలో సందేహం లేదన్న మాట వినిపిస్తోంది.

30 లక్షల మందిని చంపేస్తానన్న దేశాధ్యక్షుడు

30 లక్షల మందిని చంపేస్తానన్న దేశాధ్యక్షుడు




పిలిప్పీన్స్ దేశాధ్యక్షుడు రోడ్రిగో డుటెర్టి సంచలన కామెంట్లు చేశారు. దేశంలోని డ్రగ్ బానిసలకు మళ్లీ తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తూ యూదులను హిట్లర్ చంపినట్లుగా తాను కూడా మాదకద్రవ్యాలకు బానిసలైన వాళ్లను హతమార్చనున్నట్లు గట్టిగా హెచ్చరించారు. జర్మనీ నియంత హిట్లర్ సాగించిన హోలోకాస్ట్ మారణహోమంలో సుమారు 30 లక్షల మంది యూదులు ప్రాణాలు కోల్పోయారు ఈ సందర్భాన్ని ఉటంకిస్తూ పిలిప్పిన్స్ లో కూడా మూడు మిలియన్ల డ్రగ్ బానిసలున్నారని - వాళ్లను సంతోషంగా చంపేస్తానంటూ డుటెర్టి తాజాగా హెచ్చరికలు జారీ చేశారు.

జూన్ లో దేశాధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత డుటెర్టి దేశంలో డ్రగ్ వ్యాపారస్తులు - బానిసలపై విరుచుకుపడ్డారు. ఈ మధ్య కాలంలో పోలీసులు నిర్వహించిన ఆపరేషన్ లో సుమారు మూడు వేల మంది చనిపోయారు. కొన్ని చోట్ల రోడ్ల మీదే శవాల గుట్టలు కనిపిస్తున్నాయి. వాటిని తీసుకెళ్లే వాళ్లు కూడా లేరు. పిలిప్పీన్స్ లో నేరాలను తగ్గించేందుకు లక్ష మంది నేరస్తులను చంపనున్నట్లు ఆయన శపథం చేశారు. దావో నగరానికి గతంలో మేయర్ గా చేసిన ఆయన అక్కడే తాజాగా ఆ వ్యాఖ్యలు చేయడం విశేషం. విమర్శకులు తనను కొందరు హిట్లర్ గా పోలుస్తున్నారని అందుకే ఆ నియంత తరహాలోనే తాను కూడా డ్రగ్ బానిసలపై మరణమృందంగం మోగించనున్నట్లు చెప్పారు. రాబోయే తరాలను కాపాడేందుకు డ్రగ బానిసల ఏరివేత తప్పదన్నారు.

ధోనిని రైల్లోంచి గెంటేయబోయారట



మహేంద్ర సింగ్ ధోని బయోపిక్ ‘ఎం.ఎస్.ధోని: ది అన్ టోల్డ్ స్టోరీ’ ట్రైలర్ గమనించారంటే.. ఓ సన్నివేశంలో ధోని పాత్రధారి సుశాంత్ రాజ్ పుత్ ఎగ్జామ్ హాల్ నుంచి హడావుడిగా పరుగెత్తడం.. పరుగులు తీస్తున్న రైల్లోకి ఎక్కడం గమనించవచ్చు. ఈ సీన్ వెనుక ఓ కథ ఉంది. తన బోర్డు ఎగ్జామ్స్ లో ఆఖరుది పూర్తి చేయగానే ధోని వేరే ప్రాంతానికి వెళ్లి మ్యాచ్ ఆడాల్సి ఉందట. దీంతో అతను హడావుడిగా అలా ఎగ్జామ్ హాల్ నుంచి పరుగెత్తాల్సి వచ్చింది. ఐతే ఆ హడావుడిలో ధోని యూనిఫామ్ కూడా తీయలేదట. దీంతో రైల్లో జనాలు తనను తప్పుగా అర్థం చేసుకున్నట్లు ధోని వెల్లడించాడు.

ధోని హడావుడి అదీ చూసి అతను పరీక్షలకు భయపడి అతను ఇంట్లోంచి పారిపోయి వస్తున్నాడని రైల్లో ఉన్న పెద్దోళ్లందరూ అనుకున్నారట. కొందరు అతడికి క్లాస్ పీకడం మొదలుపెట్టారట. అంతే కాక వాళ్లు కోపంగా అతణ్ని ట్రైన్ నుంచి కూడా దించేయడానికి కూడా చూశారట. ఐతే ధోని తాను మ్యాచ్ కోసం ఇలా వెళ్లాల్సి వచ్చిందన్నాక కానీ వాళ్లు శాంతించలేదట. అయినా కొందరు అతణ్ని అనుమానంగా చూశారట. ఈ విషయాన్ని ‘ధోని’ ప్రమోషన్లలో భాగంగా ధోని వెల్లడించాడు.

తన మీద తీసిన సినిమా కోసం దాదాపు పది రోజులుగా దేశమంతా తిరుగుతున్నాడు ధోని. రోజుకు 12 గంటలు ప్రాక్టీస్ చేయమన్నా తనకు కష్టంగా ఉండదని.. కానీ సినిమా ప్రమోషన్ల కోసం ఇలా దేశమంతా తిరగడం మాత్రం ఇబ్బందిగా ఉందని.. ఈ వ్యవహారం తనకు కొత్త కావడమే అందుకు కారణమని ధోని చెప్పాడు. నీరజ్ పాండే దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఎం.ఎస్.ధోని’ శుక్రవారమే భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొస్తోంది.